
ఆటగాళ్ల కుటుంబ సభ్యులను విదేశీ పర్యటనలకు అనుమతించే విషయంలో తమ నిర్ణయం మారదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పష్టం చేసింది. జట్టుతో పాటు బోర్డుకు కూడా ఇదే మంచిదని పేర్కొంది. ఈ విషయంలో ఆటగాళ్లకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని.. అయితే, తాము జట్టు ప్రయోజనాల కోసం కఠినంగా వ్యవహరించక తప్పదని తెలిపింది.
ఈ మేరకు బోర్డు తరఫున.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) తమ స్పందన తెలియజేశారు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్ గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. 3-1తో ఓడి ఇంటిబాటపట్టింది.